Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

తస్మాత్‌ యుద్ధ్యస్వ భారత

''సేనయో రుభయో ర్మధ్యే రధం స్థాపయమే7చ్యుత!'' అని అర్జునుడు కృష్ణపరమాత్మకు ఆదేశించి ఉభయసేనల మధ్యలో తన రథాన్ని నిలిపి చూచాడు. అతనికి ఇరుపక్షాలలోను పితృసములు, పితామహులు, ఆచార్యులు, మేనమామలు, పుత్రులు, పౌత్రులు, మిత్రులు, పెద్దలు, పిన్నలు-కనబడ్డారు. దానితో అతని హృదయం దయార్ద్రమై విషణ్ణమై వికలమై పోయింది. అందుచే అతడు కృష్ణుని సమీపించి - ''కృష్ణా! కార్పణ్యం నన్ను ఆవరించింది. నా ధర్మమేదో నాకు తెలియుటలేదు. నాకు శుభాశుభ వివేకం చాలటంలేదు. నే నేం చెయ్యాలి? నీవు చెప్పు!- 'శిష్యస్తే7హం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌' నేను నీకు శిష్యుడను. అంతే కాదు. శరణాగతుడను, నాధర్మమేదో సునిశ్చితంగా నాకు ఆదేశించు'- అని వేడుకొన్నాడు. అందులకు భగవానుడు అర్జునునకు ''తస్మాత్‌ యుద్ధ్యస్వ భారత! నానుశోచితు మర్హసి''- అని క్లుప్తంగా సమాధానం చెప్పాడు.

అయితే అర్జునునకు విషాదం ఎందుకు కలిగింది? అతనికి దేహం వేరు, ఆత్మవేరు అని తెలియదు. అందువల్ల విషాదం కలిగింది. అతనికి ఈ విషాదం యధార్థజ్ఞానం బోధిస్తేకాని వదలదు. అందుచేత భగవానుడు వివరణకు పూనుకొన్నాడు. ఆయన ఇలా ఉపదేశించారు-

అర్జునా! నీవు ద్రోణుడని, భీష్ముడని వారి శరీరాలను చూచి భ్రమపడుతున్నావు. నీవు చూచే ఈ శరీరాలు నిత్యమైనవి కావు. ఇవి అంతవంతములు. వీనికి నాశనం ఉన్నది. కాని అశరీరియైన ఆత్మ అవినాశి. దానికి నాశనంలేదు. అది నిత్యమైనది - 'న జాయతే మ్రియతే వా కదాచిత్‌'- అది ఒకప్పుడు పుట్టటం లేదు. వేరొకప్పుడు పోవటం లేదు. ఆ ఆత్మను శాస్త్రాలు భేదింపలేవు. అగ్నికి దానిని దహంచేశక్తి లేదు. నీరు దానిని తడుపజాలదు. గాలికి దానిని శోషింపచేయగల శక్తిలేదు. నిజానికి ఇద్దరు భీష్ములున్నారు. ఒకటి నీకు శరీరంగా కనపడే భీష్ముడు. రెండవది ఆ శరీరంలో అంతర్గతంగా ఉండే ఆత్మ. మొదటిది వస్తూపోతూ ఉంటుంది. బాల్యము ¸°వనము, వార్థకము- అన్న వివిధ దశలు దానివే. మనుష్యుడు జీర్ణవస్త్రములు పారవేసి క్రొత్తవి ధరిస్తూ ఉంటాడు. అట్లే ఆత్మ వివిధశరీరాలను ధరిస్తూ ఉంటుంది. ఆత్మ వివిధ శరీరాలను ధరిస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క యథార్థస్వరూపం తెలుసుకొంటే నీవు దుఃఖించవు. ఆత్మ అవినాశి, అక్షరము, నశించే దేహాలను చూచి ఆత్మ నశిస్తున్నదని దుఃఖించుట ఎందుకు 'నేను పెద్దలను చంపలేను. అందుచే యుద్ధం చేయను.'- అంటావా! అసలు పెద్దలను నీవు ఏవిధంగా చంపలేవు కదా! 'తస్మాత్‌ యుద్ధ్యస్వ'- 'అందుచే యుద్ధం చేయి'- అని పరమాత్మ అర్జునినికి బోధించాడు.

నీవు చూస్తూ ఉన్న ఈ శరీరాలు ఏదో ఒకరోజున నశించి రాలిపోయేవే. నీవు యుద్ధం చేయక విరమించిన మాత్రాన అవి శాశ్వతంగా ఉండబోవు. అందుచే శరీరాలను చూచి, అవే నిజమనుకొని - 'నేను యుద్ధం చేయను' - అనటం అర్హంకాదు. 'శరీరాలు నిత్యం కాకపోయినా ఒకరికి మనచర్య వల్ల నొప్పి కలిగిస్తున్నాం కదా' - అని అనుకొంటే- నొప్పి శీతోష్ణాలను సుఖదుఃఖాలను సమంగా చూడలేని వానికే కలుగుతున్నది. కాని, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవానికి కలగటం లేదు. సుఖదుఃఖాలను మాతాస్పర్శచేత, విషయేంద్రియ సంయోగంచేత కలుగుతున్నాయి. అవి వస్తూపోతూ ఉండేవి. సుఖదుఃఖాలను సమంగా చూచే ధీరుడు వానివలన పొంగడు, క్రుంగడు. నీవు నిమిత్తమాత్రుడివి. కష్టముకాని, సుఖముగాని నీవు కలిగిస్తున్నావని అనుకోకు. ఎదుటివానికి సహనం లేనందుననే దుఃఖము, కష్టము కలుగు తు న్నాయి.

మరొక విషయం. నీవు పేర్కొన్న ఈ భీష్ముడు ద్రోణుడు సత్తా, అసత్తా? 'సత్తు' త్రికాలబాధ్యం. భూత భవిష్యద్వర్తమానాలలో ఉండేది సత్తు. సత్తు ఎన్నటికీ నశించదు. భీష్ముడు, ద్రోణుడు నీచేత చనిపోతూఉంటే వారు సత్తు ఎలా అవుతారు? అసత్తే అవుతారు. ఒక వస్తువు కొంత కాలానికి అసత్తుగా మారితే అది ఎప్పుడూ అసత్తే. సత్తు ఎన్నడూ అసత్తకాదు గనుక. అసద్వస్తువుగా భ్రమించటం పొరపాటు. ఒక వస్తువు మొదట లేకపోయి, మధ్యలో ఉండి, చివర లేకపోతే అది లేనిదానితో సమానమే. భీష్ముడు సత్తే అయితే అతడు అసత్తు ఎన్నటికి కాడు. అట్లుకాక అతడు చనిపోవుటయే నిజమైతే - అనగా అసత్పదార్థమే అయిఉంటే అతడు ప్రస్తుతం కూడా అసత్తే కాని సత్తుకాదు. అసద్వస్తువు పోతే విచారము దేనికి? 'తస్మాత్‌ యుద్ధ్యస్వ'

పరమార్థం నీకు నచ్చలేదంటావా? ఒక మెట్టు కిందకుదిగి నీ స్వధర్మాన్ని పాలించు. యుద్ధం క్షాత్రధర్మం. క్షత్రియుడవైన నీవు నీ ధర్మాన్ని ఎలా వదిలిపెట్టగలవు? ఈ యుద్ధం కొరకు నీవు వెదుకుతూ పోలేదు. అదే నిన్ను వెదుకుకొంటూ వచ్చింది. అటువంటపుడు నీవు నీ ధర్మాన్ని పాలించకపోతే విహితధర్మాన్ని అనుసరించని పాపం నిన్ను పట్టుకొంటుంది. అంతేకాదు. నీకు భీరుడవన్న అపఖ్యాతి కూడా వస్తుంది. నీవు ఏవిధంగా చూచినా సరే పరమార్థమైన సత్యదృష్టిలో కాని, స్వధర్మాచరణ దృష్టిలో కాని- స్వకీయమైనలోకమాన్యతా, దృష్టిలో కాని యుద్ధమే నీకర్తవ్యం. ఆత్మ అవినాశి అనటం యథార్థం. దానికి ఎవ్వరూ హాని చేయ్యలేరు. దేహం అంతవంతము, క్షయశీలము. దాని నెవ్వరూ నిలువబెట్టలేరు. 'తస్మాత్‌, యుద్ధ్యన్వ' అని భగవానుడు బోధించాడు.

అయితే ఎప్పుడూ యుద్ధం చేయటం, హింసించటం మాత్రమేనా గీతాభోధనం? గీత కర్మయోగమును మాత్రమే బోధిస్తూ ఉన్నదా? అంటే- కాదు; అందుకే 'తస్మాత్‌' అన్నపదం ప్రయోగించబడింది. అర్జునుడు యుద్ధంనుండితాను విరమించుకొనుటకు కొన్నికారణములు, హేతువాదములు చూపించాడు. వాని నన్నిటిని ప్రతిఘటించి కృష్ణుడు-నీవు చెప్పేకారణాలు సరియైనవికావు. 'ఒకరిని హింసించి చంపుతున్నాం' అని నీవు అనుకొంటున్నావు. అది తప్ప. సత్యం తెలియని కారణంగా నీ కీ సంతాపం కలిగింది. ''తస్మాదుత్తిష్ఠ కౌంతేయ! యుద్ధాయ కృతనిశ్చయః''- అని భగవానుడు అర్జునునకు స్వధర్మం చక్కగా తెలిపి, శోకింపకుమని హితబోధ చేసి అతనిని యుద్ధోన్ముఖునిగా చేశాడు.

ఆత్మజ్ఞానము, స్వధర్మాచరణాసక్తి అందరూ అల వరచుకోవాలి.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page